Monday, December 13, 2010

ఇందిర కన్నీళ్లు అప్పుడు చూశాను

నెహ్రూ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన వారిలో- పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్ రే ఒకరు. నిష్ణాతుడైన న్యాయవాదిగా, మంచి వ్యూహకర్తగా పేరుపొందిన రే- ఈ ఏడాది అక్టోబర్‌లో మరణించారు. మరణించటానికి దాదాపు ఏడాది ముందు- ఆయన జీవితకథను డోలా మిత్ర అనే జర్నలిస్టు రాయటం మొదలు పెట్టారు. రే మరణం తర్వాత- డోలా మిత్ర - ఆ జీవిత కథలోని కొన్ని భాగాలను విడుదల చేశారు. ఇందిర-సంజయ్‌ల మధ్య ఉన్న అనుబంధం, బంగ్లాదేశ్ యుద్ధం, జ్యోతిబసు హాస్యం మొదలైన అనేక విషయాలు ఈ భాగాలలో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని  అందిస్తున్నా..

నాకు రెండేళ్లు ఉన్నప్పుడు తొలిసారి ఇందిరను కలిసానని మా అమ్మ చెబుతూ ఉండేది. మొదటిసారే మేమిద్దరం కొట్టుకున్నామట. మా అమ్మ చెప్పిన ఆ సంఘటన తలుచుకుంటే ఇప్పటికీ నవ్వు వస్తుంది. మా అమ్మ చెప్పినదాని ప్రకారం- ఇందిర తాతగారైన మోతిలాల్ నెహ్రూ ఇందిరను వెంటబెట్టుకుని మా ఇంటికి మా తాతగారు దేశబంధు చిత్తరంజన్ దాస్‌ను కలవటానికి వచ్చారు. అప్పుడామెకు ఐదేళ్లు. మోతిలాల్ మా ఇంటికి ఉత్తి చేతులతో రాకుండా- నా కోసం ఒక బొమ్మ కొని తీసుకువచ్చారు.

ఆయన నాకు ఆ బొమ్మ ఇచ్చిన వెంటనే ఇందిర నాకేసి కోపంగా చూసింది. నా చేతిలో నుంచి బొమ్మను లాగేసుకోవాలని ప్రయత్నించింది. నేను బొమ్మను ఇవ్వలేదు. మా ఇద్దరి మధ్య భీకర యుద్ధం మొదలయింది. మా ఇద్దరిని పెద్దవాళ్లు విడదీసారు. కాని అప్పటికే బొమ్మ తల ఇందిర చేతిలోకి వెళ్లిపోయింది. కాళ్లు, మొండెం నా దగ్గర ఉండిపోయాయి.

నేను, ఇందిర తర్వాతి కాలంలో చాలా సన్నిహితంగా ఉండేవాళ్లం. చాలా విషయాలు ఒకరికొకరు చెప్పుకుంటూ ఉండేవాళ్లం. ఇప్పటికీ- అప్పుడప్పుడు ఇందిర నాకు రాసిన ఉత్తరాలను చదువుకుంటూ ఉంటా. 1980, డిసెంబర్ 21వ తేదీన ఇందిర నాకో ఉత్తరం రాసింది. ఆ ఉత్తరంలో - "ప్రియమైన సిద్ధార్థ్, నువ్వు నన్ను ఉత్సాహపరచటానికి చెబుతున్న మాటలు- నా తలపై జుట్టు నెరవకుండానో, శరీరం ముడతలు పడకుండానో ఆపలేవు.

ఈ ప్రపంచం చాలా దుస్థితిలో ఉంది. మానవులకు అనేక అవకాశాలు ఉన్నా రోజు రోజుకు దిగజారిపోతున్నారని అనిపిస్తోంది. నేను ఇప్పుడే జిడ్డు కృష్ణమూర్తిని కలిసి వచ్చాను. 85ఏళ్ల వయస్సులో కూడా ఆయన చాలా చురుకుగా ఉన్నాడు. అంత వయస్సు ఉన్నట్లు కనిపించటం లేదు. కాని మానవ సమాజంపై ఆయన అభిప్రాయాలు చాలా డిప్రెసివ్‌గా ఉన్నాయి'' అని రాసింది.

ఇందిర- సంజయ్
ఎమర్జెన్సీ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇందిరతో నాకున్న స్నేహంపై ప్రభావం చూపించాయి. ఈ సంఘటనలకు కారణం సంజయ్ గాంధీ. అతని విషయంలో తన నిస్సహాయతను, నిస్పృహను ఇందిర అనేక సార్లు నా దగ్గర వ్యక్తం చేసింది. అనేక సార్లు ఏడవటం కూడా నేను చూశాను. సంజయ్ తన పరిధిని దాటి ప్రవర్తిస్తున్నాడని, దీని వల్ల పరిస్థితులు చేయిదాటి పోతున్నాయని ఇందిరకు తెలుసు. "సిద్ధార్థా, నేను నిస్సహాయురాలిని.

సంజయ్‌ను ఏం చేయాలో అర్థం కావటం లేదు'' అని నాతో అనేక సార్లు అంది. అయినా సంజయ్ విషయంలో మాత్రం నేను చెప్పిన ఏ సలహానూ పాటించేది కాదు. సంజయ్ ఏం చెబితే అదే చేసేది. సంజయ్ అంటే ఇందిరకు భయం అనుకుంటా. ఇందిరపై అతను పూర్తి పట్టు సాధించాడు. రాజీవ్ సంజయ్ లాంటివాడు కాదు. మంచివాడు. సమర్ధుడు. నన్ను పంజాబ్ గవర్నర్ చేసింది కూడా అతనే. అతని మరణం నాకు ఒక పెద్ద దెబ్బ. రాజీవ్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ - తలలేని మొండంలా తయారయింది. ఇక సోనియా విషయానికి వస్తే- కాంగ్రెస్‌లాంటి పార్టీని నడపగలుగుతోందంటే- ఆమె చాలా తెలివైనది అయిఉండాలి.

ముక్తివాహినికి నైతిక మద్దతు
1971లో బంగ్లాదేశ్ యుద్ధం జరగడానికి ఒక రోజు ముందు ఇందిర నన్ను పిలిచింది. బెంగాలీలో మాట్లాడగల కేంద్ర మంత్రి ఎవరైనా ముక్తివాహిని కార్యకర్తలతో మాట్లాడితే వారికి చాలా నైతికధైర్యం వస్తుందని చెప్పింది. నేను బెంగాలీనే కాబట్టి నన్ను వారి దగ్గరకు వెళ్లమని కోరింది. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉంటుందని హామీ ఇచ్చింది. ఇతర దేశాల్లో జరిగే స్వేచ్ఛా పోరాటాలకు అంతర్జాతీయ చట్టాల ప్రకారం మద్దతు ఇవ్వకూడదు. అలా ఇవ్వడం వల్ల అనేక ఇబ్బందులు ఉంటాయి.

అందువల్ల నాది కేవలం ఒక అనధికార పర్యటన మాత్రమే. ఇందిరకు ఇచ్చిన మాట మేరకు నేను ఆనాటి తూర్పు పాకిస్తాన్‌కు వెళ్లాను. ఒక స్నేహితుడి ఇంటిలో బస చేశాను. నా భద్రత గురించి నా స్నేహితుడు చాలా ఆందోళన చెందాడు. ఒక రోజు రెండు గంటలు జీపులో ప్రయాణించి ఒక అడవిలోకి వెళ్లాం. అక్కడ వేల మంది ముక్తివాహిని కార్యర్తలు ఉన్నారు. వాళ్లందరూ నన్ను చూసి- 'సోనార్ బంగ్లా' పాటను పాడటం మొదలుపెట్టారు. నాకు కళ్లమ్మట నీళ్లు వచ్చాయి.

జ్యోతిబసు - కామ్రేడ్స్
జ్యోతిబసుతో నాకు రాజకీయ శతృత్వం ఉండొచ్చు. కాని అతను నాకు మంచి స్నేహితుడు. అనేక విషయాల్లో మాకు అభిప్రాయభేదాలు ఉండేవి. 1962 చైనా యుద్ధం సమయంలో జ్యోతిబసు మౌనంగా ఉండిపోయాడు. అంటే ఒక విధంగా చైనాకు మద్దతు ఇచ్చినట్లే. అప్పుడు నేను బసును చాలా తీవ్రంగా విమర్శించా. అయితే ఇవేమీ మా మధ్య ఉన్న స్నేహానికి అడ్డు వచ్చేవి కాదు. జ్యోతిబసు ప్రతి రోజు కొద్దిగా విస్కీ తీసుకొనేవాడు.

బయట ఎప్పుడూ నవ్వినట్లు కనిపించేవాడు కాదు కాని అతనికి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. ఒక సారి నేను, బసు- చందన్‌నగర్ అనే నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాం. అందమైన అమ్మాయిలు కొందరు ఆటోగ్రాఫ్ కోసం మా చుట్టూ చేరారు. వారందరి దృష్టి జ్యోతిబసు మీదే ఉంది. నేను సంతకం పెట్టి ఇస్తే ఏమీ అనలేదు.

జ్యోతిబసును మాత్రం బెంగాలీలో ఏదైనా రాసి ఇవ్వమని పట్టుపట్టారు. బసు నిరాకరించాడు. ఆ అమ్మాయిలు చాలా నిరాశ చెందారు. ఆ రాత్రి కలకత్తా తిరిగి వెళ్తున్నప్పుడు- 'ఆ అమ్మాయిలకు ఒకటి రెండు లైన్లు రాసి ఉండొచ్చు కదా..'' అన్నా. వెంటనే జ్యోతిబసు- 'అరే, పార్లే తో లిఖ్‌బో' (నాకు బెంగాలీ రాయటం వస్తే రాసి ఉండేవాడిని) అన్నాడు.

మరి కొందరు కామ్రేడ్స్‌తో కూడా నాకు అనేక సరదా అనుభవాలు ఉన్నాయి. మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ మంచి అడ్వకేట్. రాజకీయాల్లో చేరి తన ప్రాక్టీసు అంతా పాడు చేసుకున్నాడు. కలకత్తా హైకోర్టులో ఒక కేసులో మేము ఇద్దరం ప్రత్యర్థులం. జడ్జితో నేను- "యువరానర్, నా ప్రత్యర్థి వాదనలు అన్నీ బులిష్ (పనికిరానివి)'' అన్నా. వెంటనే సోమ్‌నాథ్ లేచి- "యువరానర్- నా ప్రత్యర్థి నన్ను ఎద్దు అని పిలుస్తున్నాడు.

నా రూపం సరిగ్గా ఉండదని అవహేళన చేస్తున్నాడు'' (బుల్-అంటే ఇంగ్లీషులో ఎద్దు అని అర్థం. బులిష్ అంటే ఎద్దు చేసే వాదన అని సోమ్‌నాథ్ కొత్త నిర్వచనం చెప్పారు) అన్నాడు. ఇక మిగిలిన కమ్యూనిస్టుల విషయానికి వస్తే- ప్రస్తుతం ఉన్న ఆర్థిక శాఖ మంత్రి ఆశిమ్ దాస్‌గుప్తా చాలా సమర్ధుడు. అతను ఎంఐటీలో చదువుకొని వచ్చాడు.

కాని అతనిసమర్థతకు సరిపడని పార్టీలో చేరాడు. బుద్ధదేవ్ భట్టాచార్య చాలా మంచివాడు. నిజాయితీపరుడు. అయితే ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాలు ఏవీ అతనికి లేవు. అతను ఆ పదవి నుంచి దిగిపోతే మంచిది.

No comments:

Post a Comment